అక్కినేని నాగేశ్వరరావు
స్వస్థలం: కృష్ణా జిల్లా, నందివాడ మండలం రామాపురం
జననం: 20 వ తేది గురువారం, సెప్టెంబర్ 1923
మరణం: 22 వ తేది బుధవారం, జనవరి 2014

అక్కినేని నాగేశ్వర రావు (1924-2014) ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. వరి చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలో కి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్లో విధివశాత్తు గుర్తించబడ్డాడు. ధర్మపత్ని సినిమాతో సినీజీవితం ప్రారంభించాడు. అప్పటినుండి రకరకాల తెలుగు, తమి‌ళ సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. ఎన్.టి.ఆర్ తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు.

వ్యక్తిగత జీవితం

ఆయన 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు. అన్నపూర్ణ 28.12.2011 న మృతి చెందారు. అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 22-1-2014న మరణించారు. అర్థరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుటుంబసభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి తీసుకువెళ్ళారు. పదినిమిషాలకే డా.సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతిచెందారని నిర్ధారణ అయింది.

సినీజీవితంలో ప్రముఖసినిమాలు

1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆకర్షించే రాజకుమారుడినుండి విరక్తిచెంది మందుకుబానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడినుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్ధినుండి సమర్ధుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించాడు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు ( మాయాబజార్ ), విష్ణువు (చెంచులక్ష్మి), నారదుడు (భూకైలాస్), అర్జునుడు (శ్రీకృష్ణార్జున యుద్ధం ) లో రాణించాడు.

గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, మరియు నమ్మినబంటు లో నటించి, తెలుగు నటసామ్రాట్ గా పేరుపొందాడు. మిస్సమ్మ, చక్రపాణి మరియు ప్రేమించుచూడు లాంటి హాస్యరసప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. లైలామజ్ను, అనార్కలి(1955), బాటసారి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం,మరియు మేఘసందేశం లో నటన ద్వారా తెలుగుచిత్రరంగానికి విషాదరారాజు గా పేరుపొందాడు.

దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైద్రాబాదు లో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగుసినిమాలో రికార్డు నమోదు చేసింది.ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది.

తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయనానికి నాందిపలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలలో నటించాడు. ప్రేమలో ‌ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా దేవదాసు చిత్రంలోని నటన శరత్ చంద్ర నవలలోని కథానాయకుడికి జీవంపోసింది.ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతోమంది మరిన్ని భాషలలో నటించినా, ప్రముఖ హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించినదే ఒకేఒక దేవదాసు అని అన్నాడు. సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాలలో సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్థాంగి,మాంగల్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, మరియు కాలేజి బుల్లోడు లాభాలుపొందిన సినిమాలు. 1991 లోఆయన నటజీవితం స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనమరాలు, కొత్త మరియు యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీసు హిట్ గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున మరియు మనవడు నాగచైతన్య తో కలిసినటించిన మనం ఆయన నటించిన చివరి సినిమా.

వివిధ ప్రాంతాల సాహిత్య మరియు సాంస్కృతిక ప్రముఖుల పాత్రలు అనగా , ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిషాకి చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన,తమిళనాడుకి చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాం లను తెరమీదికి తేవటం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకులు మరియు కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు .

పురస్కారాలు, బిరుదులు

ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులే కాక ఈ క్రింది పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారు.

విశిష్ట వ్యక్తి అవార్డు - 10.03.1988 - సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
రాజ్ కపూర్ స్మారక అవార్డు - 10.06.1989 - కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్.
రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు - 10.03.1980 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
పద్మవిభూషణ్(భారత ప్రభుత్వం)
పద్మ భూషణ్ - 1988 - భారత ప్రభుత్వం.
కాళిదాస్ సమ్మాన్ -- మధ్య ప్రదేశ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - 07.04.1991 - ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లీ.
లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - 21.10.1994 - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
అన్నా అవార్డు - 24.11.1995 - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
పద్మశ్రీ - 1971 భారత ప్రభుత్వం.
యన్టీయార్ జాతీయ పురస్కారము (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం)
డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు
నటసామ్రాట్
కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్)  

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ 1971
దాదాసాహెబ్ పాల్కే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - 07.04.1991 - ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లీ. 1991
పద్మ భూషణ్ 1988
పద్మ విభూషణ్ 2011
నంది ఉత్తమ నటుడు - మేఘ సంధేషం 1982
నంది ఉత్తమ నటుడు - బంగారు కుటుంబం 1994
రఘుపతి వెంకయ్య 10.03.1980 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1980