ఆవంత్స సోమసుందర్
తల్లిదండ్రులు:  కాళూరి సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ
స్వస్థలం: శంఖవరం, అన్నవరం, తూర్పు గోదావరి జిల్లా
జననం: 18 వ తేది మంగళవారం, నవంబర్ 1924

ఆవంత్స సోమసుందర్, ప్రముఖ అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు మరియు రచయిత. ఈయన రచనలలో వజ్రాయుధం (1949) అత్యంత ప్రముఖమైనది. ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్న సోమసుందర్ తెలుగు సాహిత్య క్షేత్రంలో కురువృద్దుడు. వయసు 84 వసంతాలు దాటినప్పటికీ ఇప్పటికీ కవిత్వాన్ని వెలువరిస్తున్న గొప్ప కవి, విమర్శకుడు శ్రీ సోమసుందర్ గారు. శ్రీ సోమసుందర్ గారు కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతో గత 66 సంత్సరాలుగా సాహితీ సేవ చేయుచున్నారు.

జననం - విద్యాభ్యాసం

సోమసుందర్ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న శంఖవరం అనే గ్రామంలో కాళూరి సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు నవంబరు 18, 1924న అష్టమ సంతానంగా జన్మించాడు. తన పినతల్లి ఆవంత్స వెంకాయమ్మకు సంతానం లేకపోవటం వలన చిన్నతనంలోనే సోమసుందర్ వారింటికి దత్తుకు వెళ్లారు. ఆ విధంగా కాళ్ళూరి అనే ఇంటి పేరు ఆవంత్సగా మారింది.

తనను దత్తత తీసుకున్న వారికి మెండైన సాహిత్యాభిలాష కలిగి ఉండటంవల్ల, చిన్నతనం నుంచే సంస్కృత కావ్యాలు, శతకాలు, అమరకోశం వంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం వీరికి కలిగింది. కానీ విధి వశాత్తు సోమసుందర్ దత్తత తల్లితండ్రులు ఆయనకు పదేళ్ళ వయసుండగానే పరమపదించారు. అయినప్పటికీ చిన్నారి సోమసుందర్ మనసుపై ఆ పుణ్య దంపతులు వేసిన సాహిత్య ముద్ర మాత్రం అలానే నిలిచిపోయింది. ఈయన ప్రాధమిక విద్యాభాసం అంతా పిఠాపురంలోనే జరిగింది. 1943లో కాకినాడ పి.ఆర్.కళాశాలలో ఉన్నత విద్యనభ్యసించాడు.

దేశ భక్తి

ఆ కాలంలో స్వాతంత్ర్యం కోసం జరిపే పోరాటానికి ఆ బాలగోపాలమూ ఉత్తేజితమై సర్వం త్యజించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపేవారు. సోమసుందర్ గారు కూడా అప్పుడు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో చురుగ్గా పాల్గొని గోదావరి జిల్లాలోని యువజన సంఘానికి ఉపాధ్యక్షుడైనాడు.1942 లో విద్యార్ధులను కూడదీసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెచేసారు. వీరి చర్యలకు ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం వీరిని లాకప్పులో పెట్టి, రోజూ స్టేషనుకు వచ్చి సంతకం చేయాలన్న షరతుపై విడుదల చేసింది.

సోమసుందర్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పోలీసుదెబ్బలకు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అప్పుడు వ్రాసిన వీరి మొదటి గీతంలోని దేశ భక్తిని గమనించండి.

రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా
రండర్రా గద్దల్లారా రండి రండి
సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన
నా శరీరాన్ని తినివేయండి ...........

రచనల పట్టిక

ఆవంత్స సోమసుందర్ ఇంతవరకూ 77 పుస్తకాలు రచించారు. చాలా పుస్తకాలు అనేక పునర్ముద్రణలు పొందాయి. ఈయన ప్రస్తుతం తన స్వీయచరిత్ర రెండవ భాగాన్ని వ్రాస్తున్నారు.

ఈమధ్య ప్రచురించిన వీరి పుస్తకం పేరు " దేశి సారస్వతము-సమాజ వాస్తవికత. " దేశి సాహిత్యంలో ఉండే సామాజిక స్పృహపై వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంథం.

వజ్రాయుధం: నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వ్రాసిన కవితాసంకలనం. 1946 అక్టోబరు 26న దొడ్డి కొమరయ్య మరణంపై వ్రాసిన ఖబడ్ధార్ అనే కవితతో ఇది మొదలవుతుంది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1956 లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ఇది ఇప్పటికి 5 ముద్రణలు పొందింది. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు దీనిని పాఠ్యపుస్తకంగా స్వీకరించారు.

కాహళి : ఇవి ఆంధ్రరాష్ట్ర ఉద్యమ సమయంలో వ్రాసిన కవితలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమిస్తున్న సమయంలో వారానికి ఒకటి చొప్పున "జ్వాల" అనే వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. 1953 లో పుస్తక రూపంగా వచ్చాయి.

గోదావరి జల ప్రళయం: 1953 లో గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో, సోమసుందర్ రాజమండ్రి, అమలాపురం, కపిలేశ్వరం వంటి ప్రాంతాలను సందర్శించి అప్పటి గోదావరి భీభత్సాన్ని కరుణరసార్ధ్రంగా కవిత్వీకరించారు.

రక్తాక్షి : ఫ్యూడల్ చట్రంలో సమాజం ఎదుర్కొన్న నిరంకుశత్వాలు, అమానుషత్వాలను కథా వస్తువుగా తీసుకొని చేసిన ఛందోబద్ద కావ్యం. ఈ కావ్య ప్రత్యేకత ఏమిటంటే ఆధునిక కాలంలో విస్మరింపబడ్డ ప్రాచీన ఛందస్సును తీసుకొని రచించటం. ఉదా: శ్రీ వృత్తం, వనితా వృత్తం వంటివి. రక్తాక్షి కావ్యంలో రెండు భాగాలు ఉంటాయి. 1. సచితానందం 2. రక్తాక్షి

మేఘరంజని: 1954 లో వెలువడ్డ కథాకావ్యం. దీర్ఘ వచన పద్యం. మొత్తం ఆరు అధ్యాయాలు ఉంటాయి. సోమరసం-సుందరకాండ: ఇది తాత్విక చింతనామయ కావ్యం. ఏమిటీ లోకం? ఏందుకీ బాధలు? వంటి ప్రశ్నలు, వాటికి కవి కనుగొన్న సమాధానాలతో ఈ కావ్యం రచింపబడింది.

మిణుగురులు: అద్భుతమైన పదచిత్రాలతో కూడిన ఆధునిక కవితాసంకలనం.

అనలకిరీటం: 1975 లో వెలువడిన కవితా సంపుటి. ప్రగతిశీల మరియు విప్లవాత్మక భావాల నర్మగర్భపు వ్యక్తీకరణలతో కూడిన కవితా సంపుటం. (శ్రీ సోమసుందర్ గారి మాటలలో)

వెన్నెలలో కోనసీమ : 1977 లో అమలాపురంలో ఆవిష్కరింపబడిన గీత సంపుటి. సంగీతానికి అనుకూలంగా ఉండే గీతాల రచన. ఈ గీతాలలో చాలావాటిని రేడియోలలో పాటలుగా పాడారు.

రాలిన ముత్యాలు: మినీ కవితల ఉద్యమానికి ముందే లఘుకవితల పేరిట వ్రాసినటువంటి చిన్ని చిన్ని కవితలు.

మాఊరు మారింది: సోమసుందర్ ఎమర్జన్సీని సమర్ధించారు. ఈ విషయం నార్ల వెంకటేశ్వరరావును కలవరపరచి, వీరితో భేటీ అయి అయిదురోజులపాటు చర్చించగా, ఈయన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా తన భావాలను మార్చుకొని, ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది. ఆ భావ పరిణామక్రమంలో వ్రాసిన 7 భాగాల కావ్యమే మావూరు మారింది. దీనిలో ప్రణాళికల ద్వారా గ్రామాలే విధంగా మారాయి అని వివరిస్తూ వ్రాసినటువంటి కావ్యం.

ఆగతనికి శుభారంభం : వచన కవితలు

బృహత్కావ్యాలు (నాలుగు సుదీర్ఘ కవితలు): నాలుగు దీర్ఘకావ్యాలు. సుమారు 300 పేజీల పుస్తకం. ఈ పుస్తకంలో అక్షయతరంగిణి, కాలం వీలునామా, ముక్తఛ్ఛాయ, అరచే లోయలు అనే నాలుగు దీర్ఘ కవితలు ఉంటాయి. దీనిలో ముక్తఛ్చాయలో మననుంచి మన నీడ విడిపోవటం, అసలు మననీడ అంటే ఏమిటి అనే విషయాలపై తాత్విక, భౌతిక చింతనలతో కూడిన భావాలుంటాయి.

ఆధునిక కవిత్వం: వ్యాసావళి

క్షితిజ రేఖలు: అయిదు దీర్ఘ కావ్యాలు.

మార్క్సిజము-కవిత్వం: వ్యాసావళి

ఒక్క కొండలో వేయి శిల్పాలు: 120 పేజీల దీర్ఘ కవితల సంకలనం

ఆంగ్ల సీమలో ఆమని వీణలు (యాత్రా సాహిత్యం): 1983 లో వీరు ఆంగ్లసీమలో చేసిన ప్రయాణ విశేషాలతో కూడిన ట్రావెలాగ్.

గంధ మాదనం: రచనా కాలం 1995/96. హనుమంతుడు సీతను అన్వేషించటానికి వెళ్లినపుడు మధ్యలో మకాంచేసిన పర్వతం పేరు గంధమాదనం. జీవితం యొక్క అన్వేషణకు గ్రంథాలయం ప్రాతిపదిక అనే భావనతో వ్రాసిన దీర్ఘకావ్యం.

చేతావని: చేతావని అంటే వార్నింగ్ (1994). బాబ్రి మసీదు కూల్చినపుడు వ్రాసిన దీర్ఘ కావ్యం. 50 పేజీలు.

దోనా పాలా: ఇది ఒక ప్రదేశం పేరు. గోవా ప్రయాణంలో వ్రాసిన కవితలు.

రక్షరేఖ: బాబ్రి మసీదు కూలగొట్టిన తరువాత బొంబాయిలో (ముంబాయి) మతకలహాలు చెలరేగాయి. ఇలాంటి మతకలహాలు పాకిస్తాను విడిపోయినప్పుడు కూడా జరగలేదు. వాటికి స్పందిస్తూ వ్రాసినటువంటి దీర్ఘ కవితా సంపుటి.

హృదయంలో హిరోషిమా: 1997 లో హిరోషిమా ఉదంతాన్ని స్మరించుకొంటూ వ్రాసిన కవితలు.

ధూపఛ్చాయ: నక్సలైట్లు రైలుపెట్టిని కాల్చివేస్తే దాన్ని నేపథ్యంగా తీసుకొని వ్రాసిన దీర్ఘకావ్యం.

జీవన లిపి : 120 పేజీల సంపూర్ణ కావ్యం. మానవుడు విప్లవానికై జరిపే కృషి అనే అంశంపై వ్రాసిన దీర్ఘకావ్యం.

సీకింగ్ మై బ్రోకెన్ వింగ్ :దేశంలో వామపక్ష అతివాద పార్టీలన్ని విడిపోతున్నాయి. దాన్ని సింబలైజ్ చేస్తూ వ్రాసిన అన్వేషాత్మకమైన దీర్ఘ కవిత.

సోమసుందర్ కథలు : 1984 లో ప్రచురింపబడిన సోమసుందర్ బానిసల దేశం వగైరా కథలు.

బుద్ధదేవ్ బోస్: బుద్ధదేవ్ బోస్ అనే ఆయన ప్రముఖ బెంగాలీ కవి. వీరి మోనోగ్రాఫ్ మరియు కొన్ని కవితల యొక్క అనువాదాలతో కూడిన రచన.

లియోనార్డో డావిన్సీ: డావిన్సీ జీవిత చరిత్ర. ఆయనను ఒక సంపూర్ణ మానవునిగా దర్శింపచేసే పుస్తకం.

హంసధ్వని: భారతీయ ఆధునిక సంగీతకారుల జీవితచిత్రణలు. (బిస్మిల్లా, బడేముల్లా తదితరులు).

కాజీ నజ్రుల్ ఇస్లాం: శ్రీ ఖాజీ, బెంగాలీ విప్లవకవి. వీరి కవిత్వాన్ని, జీవితాన్ని ఈ పుస్తకంద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసారు.

కాళిదాసు రామకథ: రచనా కాలం 1990 లు. రఘువంశంలో కాళిదాసు చెప్పిన రామకథకు, వాల్మీకి రామకథకు గల సునిశితమైన వ్యత్యాసాలను తెలుపుతూ వ్రాసిన విశ్లేషణాత్మక పుస్తకం.

రుధిరజ్యోతిర్ధర్శనం: శ్రీరంగం నారాయణబాబు కవిత్వం లోతు పాతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూపించిన గొప్ప విమర్శనాత్మక గ్రంధం. నారాయణ బాబు గొప్ప కవేమీ కాదు అని వ్యాఖ్యానించిన శ్రీ శ్రీ తో విభేదించి , సోమసుందర్ నారాయణ బాబు వ్రాసిన రుధిర జ్యోతి కావ్య సౌందర్యాన్ని ఈ పుస్తకంద్వారా తెలుగు ప్రజలకు పరిచయం చేసారు. ఈ కారణం చేతనే శ్రీ శ్రీ కి సోమసుందర్ గారికి అభిప్రాయ బేధాలు పొడచూపాయి.

జాతికి జ్ఞాన నేత్రం: కొడవటిగంటి కుటుంబరావు రచనలపై చేసిన విశ్లేషణాత్మకమైన గ్రంధం.

కవిత్వం కాలాతీత కాంతిరేఖ: ఆధునిక కవిత్వానికి ఉండవలసిన లక్షణాలపై సూత్రీకరణ చేస్తూ వ్రాసిన విశ్లేషణాత్మకమైన 200 పేజీల గ్రంధం.

ఆధునిక కావ్య ప్రకాళిక: ఇతరుల పుస్తకాలకు వ్రాసిన పీఠికలలో కొన్నింటిని ఏర్చి కూర్చి చేసిన సంకలనం.

అమృత వర్షిణి: తిలక్ కవిత్వంపై వ్రాసిన విమర్శనాత్మక వ్యాసావళి.

సాహిత్యంలో సంశయ కల్లోలం: విరసం ఆవిర్భవించిన కొత్తలో విజయనగరం నుంచి చిత్తూరుదాకా ప్రయాణించి సభలు జరిపి, ఆ సభల్లో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు ఇచ్చిన సమాధానాల సంకలనం. ఆ ఆ ప్రదేశాలలో వారి సందేహాలను చిన్న చిన్న స్లిప్పులపై తీసుకొని, వాటికి సమాధానాలను పత్రికా ముఖంగా ఇచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరించి ఈ పుస్తకంగా ప్రచురించారు. అక్షర సుమార్చన: తిక్కన, వేమన ఇత్యాదులపై వ్రాసిన వ్యాసావళి. వావిలాల గోపాల కృష్ణయ్యకు అంకితమీయబడినది

పురిపండా ఎత్తిన పులి పంజా: పురిపండా అప్పలస్వామి వారిపై వ్రాసిన వ్యాస సంపుటి.

నూరు శరత్తులు : 1990 లకి నూరేళ్ళు నిండిన కృష్ణ శాస్త్రి, విశ్వనాధ మొదలైనవారిపై వ్రాసిన వ్రాసావళి. ఆ తరం కవితా తరంగాలు: భావకవుల తరువాత వచ్చిన పఠాభి, పాలగుమ్మి పద్మరాజు, వంటి వారిపై వ్రాసిన వ్యాసావళి.

నారాయణ చక్రం: డా: సి. నారాయణరెడ్డి కవిత్వంపై విశ్లేణాత్మకంగా వ్రాసిన గ్రంధం.

గోపుర దీపాలు : చలం పురూరవ పై వ్రాసిన పుస్తకం.

కృష్ణశాస్త్రి కవితాత్మ: కృష్ణశాస్త్రి కవిత్వంపై సమగ్ర విమర్శ.

గురజాడ గురుత్వాకర్షణ: గురజాడ అప్పారావు పై వ్రాసిన పుస్తకం. పూర్రిచర్డ్ అనే మాటపై పరిశోధన ఉంటుంది.

శరచ్చంద్రిక : శ్రీశ్రీ నుంచి కుందుర్తి ఆంజనేయులు వరకూ ఆధునిక కవులపై వ్రాసిన పరిశీలనాత్మక వ్యాసావళి.

ఉర్దూసాహిత్యంలో ఉన్నత శిఖరాలు: కబీర్ నుంచి ఖైఫీ అహ్మద్ దాకా ఉండిన గొప్ప గొప్ప ఉర్దూ కవులను గురించి పరిచయంచేస్తూ వ్రాసిన పుస్తకం.

శేషేంద్ర జాలం: శేషేంద్ర కవిత్వంపై వ్రాసిన వ్యాసావళి.

అగ్నివీణ ఆలాపించిన అణుసంగీతం: అనిసెట్టి సుబ్బారావు కవిత్వంపై వ్రాసిన విశ్లేషణాత్మక పుస్తకం.

కవితా కల్పవల్లి: ఆధునిక కవిత్వం-విమర్శనాత్మక విశ్లేషణ.

ఆగామి శతాబ్ధానికి ఆహ్వానం: వ్యాసాలు.

చరమ దశాబ్ది-కవితా రసాబ్ధి: 90 లలో కవిత్వంపై వచ్చిన వ్యాసావళి.

అక్షర నాదం: 2004 లో వెలువరించిన కవితా సంపుటి.

ఆమ్రపర్ణి: కావ్యం జీవన లిపి: సంపూర్ణ కావ్యం

చిన్మయ లహరి: స్వీయ కవితా సంపుటి.

మనస్సంగీతం: పాటల సంపుటి.

విషవలయం: నాటకం. 1980 లలో అనేక పరిషత్తులలో బహుమతులు సాధించిన గొప్ప నాటకం

సోమసుందర్ లేఖలు: సినీనటుడు రమణారెడ్డికి సోమసుందర్ వ్రాసిన లేఖలను నెల్లూరులోని వీరి అభిమానులు పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు. నగరం నుంచి గగనం దాకా మనిషి: వివిధ పత్రికలలో చుట్టు-చూపు అనే పేరుతో వచ్చిన వ్యాసాలన్నింటిని సంగ్రహపరచి ప్రచురించిన పుస్తకం. సుమారు 250 పేజీలు.

మంది-మనిషి: వ్యాస సంపుటి .

సోమసుందర్ వద్ద ప్రస్తుతం ఇంకా 10 పుస్తకాలవరకూ అముద్రితంగా ఉన్నాయి. త్వరలో వెలువరించాలన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

పురస్కారాలు

సోమసుందర్ 1979లో అత్యంత ప్రతిష్ఠాకరమైన సోవియెట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి పొందాడు. రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, గౌరవ డాక్టరేట్ వంటివి పొందాడు. 2008 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారాన్ని అందుకున్నాడు.