అయ్యగారి సాంబశివరావు
స్వస్థలం: పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు
జననం: 20 వ తేది ఆదివారం, సెప్టెంబర్ 1914
మరణం: 31 వ తేది శుక్రవారం, అక్టోబర్ 2003

ఎ.యస్.రావు గా ప్రసిద్ధుడైన అయ్యగారి సాంబశివరావు(1914–2003) భారతదేశ అణు శాస్త్రవేత్త. హైదరాబాదు లోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు  మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు.

బాల్యం,విద్యాభ్యాసం

ఎ.యస్.రావు సెప్టెంబర్ 20, 1914 న పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు లో జన్మించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి విజ్ఞానశాస్త్రములో మాస్టరు డిగ్రీ అందుకొని అక్కడే అధ్యాపకునిగా ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశాడు. 1946లో సాంబశివరావు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ చేయటానికి ప్రతిష్ఠాత్మక టాటా ఉపకార వేతనాలకు ఎన్నికైనాడు. 1947లో స్టాన్‌ఫర్డ్ నుండి ఇంజనీరింగు పట్టాపుచ్చుకొని భారతదేశము తిరిగివచ్చిన తర్వాత భారతదేశ అణుశక్తి విభాగములో అణు శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ హోమీ బాబా వంటి ప్రముఖులతో కలసి పనిచేశాడు. ఈయన 2003, అక్టోబర్ 31న మరణించాడు.

విజయాలు

సాంబశివరావు హోమీ భాభా మరియు విక్రం సారాభాయ్ లతో కలసి పనిచేశాడు. అతడు భారత దేశంలో గల యువ శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగించాడు. ఈ ముగ్గురు మరియు మరికొంతమంది ప్రతిభావంతులలో ఒకరైన సూరి భగవంతం లతో కలసి ఒక ఎలక్ట్రానిక్స్ కమిటీ యేర్పాటు చేయబడినది. దీనిని "భాభా కమిటీ" అని అంటారు. ఇది పరిశ్రమల అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అధ్యయనం భారతదేశంలో ఎలా ఉండాలో పరిపూర్ణ నివేదికను, సూచనలను అందజేసింది.

పురస్కారాలు

రావుగారు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి మరియు యునైటెడ్ నేషన్స్ లోజరిగే అణు శక్తి ఉపయోగాల పై శాంతి సమావేశాల వంటి అనేక అంతర్జాతీయ సమావేశాలకు భారత దేశం తరపున పాల్గొన్నారు. ఆయన అనేక విజ్ఞాన పత్రికలకు సంపాదకునిగా, సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ కు కూడా సంపాదకునిగా పనిచేశారు.

పద్మశ్రీ పురస్కారం, 1960
శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం, 1965
గౌరవ డాక్టరేటు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1969,
పద్మ భూషణ్ పురస్కారం, 1972
ఫెలో ఆఫ్ ఇండియన అకాడెమీ ఆఫ్ సైన్సెస్, 1974,
ఫిక్కీ అవార్డ్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇంజనీరింగ్, 1976,
ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) వారి నేషనల్ డిజైన్ అవార్డు, 1977,
ఆంధ్రప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్స్ యొక్క విశిష్ట శాస్త్రవేత్త అవార్డు 1988,
డా.నాయుడమ్మ స్మారక బంగారు పతకం 1989.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ 1960
గౌరవ డాక్టరేట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం 1969
పద్మ భూషణ్ 1972