చిరంజీవి - కొణిదెల శివశంకర వరప్రసాద్
తల్లిదండ్రులు:  కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి
స్వస్థలం: మొగల్తూరు,ఆంధ్రప్రదేశ్
జననం: 22 వ తేది సోమవారం, ఆగస్ట్ 1955

చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా

కుటుంబం

ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కథానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా సినిమా నిర్మాణం 2007లో "చిరుత"తో ప్రారంభమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలైంది.రామ్ చరణ్ రెండవ సినిమా మగధీర.ఈ సినిమా జులై 31న విడుదలై 301 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ చిత్రం తెలుగు చలన చిత్ర రంగం లోనే అతి పెద్ద విజయం అనే రికార్డును నెలకొల్పినది. చిరంజీవి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.దాని పేరు ప్రజారాజ్యం. ఇది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని ఈ పార్టీని స్థాపించడం జరిగింది.ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

సేవా కార్యక్రమాలు

చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మ భూషణ్ భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ 2006
గౌరవ డాక్టరేట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం 2006