సింగిరెడ్డి నారాయణరెడ్డి
తల్లిదండ్రులు:  మల్లారెడ్డి, బుచ్చమ్మ
స్వస్థలం: కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట్లో
జననం: 29 వ తేది బుధవారం, జులై 1931

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

బాల్యం, విద్యాభ్యాసం

సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి.నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలోనీ హరికథలు, జానపదాలు,జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు.తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు.విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో శ్రద్ధగా అనేక గ్రంథాలు చదివాడు.సి.నా.రె గా ప్రసిధ్దుడు.

పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ
కేంద్ర సాహిత్య అకాడెమీ
భారతీయా భాషా పరిషత్
రాజలక్ష్మీ పురస్కారం
సోవియట్-నెహ్రూ పురస్కారం
అసాన్ పురస్కారం 
మొదలైనవి ఆయన్ను వరించాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.

పదవులు

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989)
ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు.
భారత రాష్ట్రపతి ఆయన్ను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు.ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు , ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడుతున్నాడు.

రచనలు

కవిత్వం:
విశ్వంభర, ఆరోహణ, మనిషి - చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కలం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయడు, కొనగోటి మీద జీవితం, రెక్కల సంతకాలు, వ్యక్తిత్వం

వ్యాసాలు:
పరిణత వాణి

గేయనాటికలు:
అజంతా సుందరి : 1955లో సినారె ఈ సంగీత రూపకాన్ని రచించారు. 1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం.
వెన్నెలవాడ
రచనారంగమే కాక ఆయన తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. వేమూరి ఆంజనేయశర్మ, చిర్రావూరి సుబ్రహ్మణ్యంతో పాటుగా సినారె పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు.