దామోదరం సంజీవయ్య
తల్లిదండ్రులు:  మునెయ్య, సుంకులమ్మ
స్వస్థలం: కర్నూలు జిల్లా, కల్లూరు లో, పెద్దపాడు
జననం: 14 వ తేది సోమవారం, ఫిబ్రవరి 1921
మరణం: 07 వ తేది ఆదివారం, మే 1972

దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 7,1972) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.

బాల్యము మరియు విద్యాభ్యాసము

సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలి చేసి జీవనము సాగించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మేనమామతో పాలకుర్తికి తరలివెళ్లినది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరాడు. 1935 లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938 లో SSLC (ఎస్.ఎస్.ఎల్.సీ) జిల్లాలోనే ప్రధమునిగా ఉత్తీర్ణుడయ్యాడు.

ముఖ్యమంత్రిగా

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లాలోని బస్సురూట్లను జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి.సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవ చేసాడు.1962లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన సంజీవయ్య, గవర్నరుకు రాజీనామా సమర్పించిన మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడిచి వెళ్ళారు. త్రోవలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు. సంజీవయ్య వ్రాసిన లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు.

1967లో ఎన్నికల ప్రచార సమయములో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. 1972 మే 7 వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు మే 9వ తేదీన సికింద్రాబాదులోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు. 2008 లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి ఆయన జ్ఞాపకార్థం 2012 లోదామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరుమార్చారు.

నిర్వహించిన పదవులు

1950 - 1952 ప్రొవిజనల్ పార్లమెంటు సభ్యుడు
1952 ఏప్రిల్ 20 - 1953 అక్టోబర్ 1 రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర మున్సిపల్ మరియు సహకార శాఖా మంత్రి
1953 అక్టోబర్ 1 - 1954 నవంబర్ 15 ప్రకాశం మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య, హరిజనోద్ధరణ మరియు పునరావాస శాఖా మంత్రి
1955 మార్చి 28 - 1956 నవంబర్ 1 బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర రవాణా మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి
1956 నవంబర్ 1 - 1960 జనవరి 10 నీలం సంజీవరెడ్డి మంత్రివర్గములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రమ మరియు స్థానిక స్వయంపరిపాలనా శాఖా మంత్రి
1960 జనవరి 11 - 1962 మార్చి 29 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
1962 జూన్ - 1964 జనవరి 6 అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు.
1964 జనవరి 24 - 1964 జూన్ 9 నెహ్రూ ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు ఉద్యోగ శాఖామంత్రి
1964 జూన్ 9 - 1966 జనవరి 23 లాల్ బహుదూర్ శాస్త్రి ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు ఉద్యోగ శాఖామంత్రి
1966 జనవరి 24 - 1967 మార్చి 12 ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర పరిశ్రమల శాఖామంత్రి
1970 ఫిబ్రవరి 18 - 1971 మార్చి 18 ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు పునరావాస శాఖామంత్రి
1971 మార్చి 18 - 1972 మే 7 అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు.