దాశరధి రంగాచార్యులు
స్వస్థలం: ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరు
జననం: 24 వ తేది శుక్రవారం, ఆగస్ట్ 1928
మరణం: 08 వ తేది సోమవారం, జూన్ 2015


దాశరథి రంగాచార్యులు ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.

జీవిత విశేషాలు

దాశరథి రంగాచార్యులు ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరు లో జన్మించారు. ఆయన అన్న ప్రముఖ కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.

విశిష్టత, ప్రాచుర్యం

దాశరథి రంగాచార్యులు రాసిన "చిల్లర దేవుళ్లు" నవల సినిమాగా తీశారు. టి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పలు భాషలలోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళప్రాచుర్యం పొందింది. దాశరథి రంగాచార్యులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ పోరాట క్రమానికి నవలల రూపం కల్పించడం, తెలంగాణ ప్రాంత చారిత్రిక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ "జీవనయానం" వంటివి సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.

పురస్కారాలు, సత్కారాలు

దాశరథి రంగాచార్యుల "చిల్లర దేవుళ్లు" నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందు వల్ల రంగాచార్యులను అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు. 21-1-1994న ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్యులు దంపతులకు సత్కరించారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాశరథి రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు జరిగాయి.

రచనలు
రంగాచార్యులు నవలలు, ఆత్మకథ, వ్యాసాలు, జీవిత చరిత్రలు, సంప్రదాయ సాహిత్యం తదితర సాహితీప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు.

నవలలు
మోదుగుపూలు
చిల్లర దేవుళ్ళు
జనపథం
రానున్నది ఏది నిజం?
అమృతంగమయ

ఆత్మకథ
జీవనయానం

అనువాదాలు
నాలుగు వేదాల అనువాదం
ఉమ్రావ్ జాన్

జీవిత చరిత్ర రచనలు
శ్రీమద్రామానుజాచార్యులు
బుద్ధుని కథ

ఇతరాలు
శ్రీమద్రామాయణం
శ్రీ మహాభారతం
వేదం-జీవన నాదం
శతాబ్ది