గుళ్ళపల్లి నాగేశ్వరరావు
స్వస్థలం: కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు
జననం: 01 వ తేది శనివారం, సెప్టెంబర్ 1945

గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.సొంతూరు కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు. సెప్టెంబర్ 1, 1945లో అమ్మమ్మగారి ఊరు చోడవరం (నాగాయలంక మండలం) లో జన్మించాడు. అంతర్జాతీయ కంటి వైద్యశాస్త్ర రంగములో "నాగ్" పేరుతో నాగేశ్వరరావు ప్రఖ్యాతి గాంచాడు.తాతగారు కోవెలమూడి రాఘవయ్య స్వాతంత్య్ర సమరయోధుడు.తొలి ఉపాధ్యాయుడు సీతారామయ్య.

విద్య, వైద్యము

ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పి.యు.సి, గుంటూరు వైద్య కళాశాలలో యం.బి.బి.యస్ చదివాడు. తరువాత ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో కంటి జబ్బులకు సంబంధించిన ప్రత్యేక కోర్స్ చేశాడు. 1974లో ఉన్నత విద్యకై బోస్టన్, అమెరికా వెళ్ళాడు. రోచస్టర్ విశ్వవిద్యాలయము వైద్య కళాశాలలో వైద్యునిగా, బోధకునిగా 1986వరకు కొనసాగాడు. యల్.వి. ప్రసాద్ తనయుడు రమేష్ ప్రసాద్ ప్రోద్బలముతో హైదరాబాదులో "యల్.వి. ప్రసాద్ కంటి వైద్యశాల" స్థాపించడానికి మూల కారకుడై, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థగా రూపొందించాడు. కంటికి సంబంధించిన వ్యాధులపై 250 పరిశోధనావ్యాసాలు వ్రాశాడు. నాగేశ్వరరావు ఆధ్వర్యములో 2,50,000 మందికి కంటి శస్త్రచికిత్సలు జరిగాయి.

పురస్కారాలు

అంధత్వ నివారణకు చేసిన సేవలకు గాను నాగేశ్వరరావుకు పలు పురస్కారాలు లభించాయి. పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి.
భారత శాస్త్ర అకాడెమీ ఫెలొ -
అంతర్జాతీయ అంధత్వ నిరోధక సంస్థకు అధ్యక్షుడు.
అమెరికా కంటివైద్యశాస్త్ర అకాడెమి పురస్కారము-1983.
భారత జాతీయ వైద్యశాస్త్ర అకాడెమి ఫెలో-1996.
ప్రపంచ అంధత్వనిరోధక పురస్కారము - అమెరికా కంటి వైద్యశాస్త్ర అకాడెమి-2006.