గుమ్మడి వెంకటేశ్వరరావు
తల్లిదండ్రులు:  బసవయ్య, బుచ్చమ్మ
స్వస్థలం: రావికంపాడు, తెనాలి, గుంటూరు జిల్లా
జననం: 09 వ తేది శనివారం, జులై 1927
మరణం: 26 వ తేది మంగళవారం, జనవరి 2010

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.జూలై 9, 1927 మ.జనవరి 26, 2010 ) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

జీవిత విశేషాలు

గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో పండించడం అతడికి కరతలామలకం. అన్ని రకాల వేషాలు ఆయన ధరించినా సాత్విక వేషాలలో ఆధిక్యత సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. ఆంధ్రుల పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.

బాల్యము మరియు విద్యాభ్యాసం

గుమ్మడి స్వగ్రామము గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. ముగ్గురు తమ్ములు, ఒక చెల్లి ఉన్నారు. కుటుంబ సభ్యుల అప్యాయతానురాగాల మధ్య గారాబంగా గుమ్మడి జీవితం గడిచింది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు అనుబంధాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడానికి అయనకు అవకాశం కలిగింది. ఉమ్మడి కుటుంబం వాతావరణంలో పెరిగిన గుమ్మడి జీవితం ఆయన నట జీవితంలో ప్రతిఫలించి సాత్విక పాత్రలలో ఆయన జీవించడానికి సహకరించింది. తన తండ్రి బసవయ్య, పెదనాన్న నారయ్యలు, రక్తసంబంధంతోనే కాక స్నేహానుబంధంతో మెలిగేవారని గుమ్మడి మాటలలో తెలుస్తుంది. గుమ్మడి వెంకటేశ్వరరావు నాయనమ్మకు అమ్మమ్మ 103 సంవత్సరాలు జీవించడం వారి కుటుంబంలో ఒక విశేషం.

గుమ్మడి పోషించిన పాత్రలు
పురాణ పాత్రలు:
బలరాముడు, భీష్ముడు, భృగుమహర్షి, దుర్వాసుడు, జమదగ్ని, కర్ణుడు , విశ్వామిత్రుడు, ధర్మరాజు, సత్రాజిత్తు, దశరథుడు చారిత్రాత్మక పాత్రలు: పోతన, కబీర్ దాసు, తిమ్మరుసు, కాశీనాయన
సాంఘీక పాత్రలు: దివాన్, డాక్టర్, ముఖ్యమంత్రి, వ్యవసాయదారుడు, న్యాయవాది, మునసబు, నందుడు, పోలీసు అధికారి, ప్రధానోపాధ్యాయుడు, జమీందారు

పురస్కారాలు
1998 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చి సత్కరించింది.
1982 : మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డాడు.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
రఘుపతి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు 1998
నంది మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా 1982