ఇంద్రగంటి జానకీబాల
తల్లిదండ్రులు:  సూరి రామచంద్రశర్మ, లక్ష్మీనరసమాంబ
స్వస్థలం: రాజమండ్రిలో
జననం: 04 వ తేది మంగళవారం, డిసెంబర్ 1945

ఇంద్రగంటి జానకీబాల కవయిత్రిగా, రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణిగా కృషిచేశారు. జానకీబాల భర్త, మామలు తెలుగు సాహిత్యంలో కవులుగా, సాహిత్యవేత్తలుగా ప్రసిద్ధి పొందారు.

వ్యక్తిగత జీవితం

ఇంద్రగంటి జానకీబాల డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. జానకీబాల తల్లిదండ్రులు సూరి రామచంద్రశర్మ, లక్ష్మీనరసమాంబ. ఆమె విద్యాభ్యాసాన్ని తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో పూర్తిచేశారు. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సెక్షన్ గుమస్తా ఉద్యోగంలో చేరారు. తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులైన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మూడో కుమారుడు కవి, విమర్శకుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మను వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినీరంగంలో దర్శకునిగా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా విజయవాడలో పాతికేళ్లపాటు నివసించారు. 1991లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

సాహిత్యరంగం

జానకీబాల కవయిత్రిగా, రచయిత్రిగా, పరిశోధకురాలిగా పలు గ్రంథాలు రచించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం కొమ్మా కొమ్మా కోయిలమ్మా..ను వెలువరించారు. జానకీబాల ఆరు కథాసంపుటాలను, పన్నెండు నవలలను, ఒక కవిత్వసంకలనాన్ని ప్రచురించారు.

రచనల జాబితా

నవలలు
కరిగిన హరివిల్లు
విశాల ప్రపంచం
వెన్నలమట్టి
ఆవలితీరం
తరంగిణి (పుస్తకం)
నీలిరాగం
నిజానికి అబద్ధానికి మధ్య
మాతృబంధం
సజలనేత్రి
కనిపించేగతం
రాగవల్లకి
పంజరం కోరిన మనిషి

పురస్కారాలు

సంగీత, సాహిత్యరంగాల్లో కృషిచేసిన జానకీబాలను పలు పురస్కారాలు వరించాయి. అవి:
కనిపించే గతం నవలకు గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం.
కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం.
జ్యోత్స్నా పీఠం సంస్థ నుంచి కథారచయిత్రిగా జ్యోత్స్నాపీఠం పురస్కారం.