కందుకూరి వీరేశలింగం పంతులు
తల్లిదండ్రులు:  పున్నమ్మ, సుబ్బారాయుడు
స్వస్థలం: రాజమండ్రి
జననం: 16 వ తేది ఆదివారం, ఏప్రిల్ 1848
మరణం: 27 వ తేది మంగళవారం, మే 1919

గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.

జీవిత విశేషాలు

వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లా లోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రి కి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.

వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.

చదువుకునే రోజుల్లో కేశుబ్ చంద్ర సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.

1867 లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.

ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరు లో వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.

కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులు తో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొదటి ప్రహసనం కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.

యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27 న మరణించాడు.

నవలలు

రాజశేఖర చరిత్రము - తొలి తెలుగు సాంఘిక నవల. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్" అనే నవలకూ దీనికీ కొన్ని పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కాని అనుకరణ కాని కాదని వీరేశలింగం చెప్పాడు. "పంతులుగారి మహాయశస్సునకు శరత్కౌముది వంటిది" అని అక్కిరాజు రమాపతిరావు అన్నాడు. ఇందులో రచయిత సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను విమర్శించాడు. చక్కని తెలుగు సామెతలను, లోకోక్తులను ప్రయోగించి ముందుతరం నవలలకు మార్గదర్శకంగా నిలచాడు.

సత్యరాజా పూర్వదేశ యాత్రలు - ఆంగ్లంలో "జోనాథన్ స్విఫ్ట్" వ్రాసిన "గల్లివర్స్ ట్రావెల్స్" ఆధారంగా వ్రాశాడు. ఇందు సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు. "ఆడ మళయాళం" అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది.

సత్యవతీ చరిత్రము (1883) - స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవల - ఆ రోజులలో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందింది.

చంద్రమతీ చరిత్రము (1884) - మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల.

వీడియోలు...

వీరేశలింగం పంతులు గురించి

వీరేశలింగం పంతులు జయంతి ఉత్సవాలు

ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం