పాములపర్తి వెంకట నరసింహారావు
తల్లిదండ్రులు:  రుక్నాబాయి, సీతారామారావు
స్వస్థలం: వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి
జననం: 28 వ తేది మంగళవారం, జూన్ 1921
మరణం: 23 వ తేది గురువారం, డిసెంబర్ 2004

భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.

తొలి జీవితం

తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ లు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరు లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.

పీవీ నిర్వహించిన పదవులు

1951 - అఖిల భారత కాంగ్రెసు కమిటీ సభ్యత్వం
1957-77 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యత్వం
1962-64 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1964-67 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
1967 ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
1968-71 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1971-73 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
1977 లోక్‌సభ సభ్యత్వం
1980 లోక్‌సభ సభ్యత్వం
జనవరి 1980-జూలై 1984 కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రి
జూలై 1984-డిసెంబర్ 1984 కేంద్ర హోం శాఖమంత్రి
1984 లోక్‌సభ సభ్యత్వం (మూడో సారి)
నవంబర్ 1984-ఫిబ్రవరి 1985 భారత ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
జనవరి 1985-సెప్టెంబర్ 1985 కేంద్ర రక్షణ శాఖమంత్రి
సెప్టెంబర్ 1985-జూన్, 1988 కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
జూలై 1986- ఫిబ్రవరి 1988 కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి
జూన్ 1988-డిసెంబర్ 1989 విదేశ వ్యవహారాల శాఖ మంత్రి
1989 లోక్‌సభ సభ్యత్వం (నాలుగోసారి)
29 మే, 1991 - 1996 కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు
జూన్ 1991 – మే 10 1996 ప్రధానమంత్రి
నవంబర్ 1991 ఉప ఎన్నికలలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదవసారి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.