పెరుగు శివారెడ్డి
తల్లిదండ్రులు:  పెరుగు హుస్సేన్ రెడ్డి
స్వస్థలం: కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు
జననం: 12 వ తేది ఆదివారం, సెప్టెంబర్ 1920
మరణం: 06 వ తేది మంగళవారం, సెప్టెంబర్ 2005

డాక్టర్ పెరుగు శివారెడ్డి (సెప్టెంబర్ 12, 1920 - సెప్టెంబర్ 6, 2005) ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.

బాల్యం-విద్యాభ్యాసం

పెరుగు శివారెడ్డి కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు గ్రామంలో 1920 , సెప్టెంబరు 12 న జన్మించారు. ఈయన తండ్రిపేరు పి.హెచ్.రెడ్డి. (పెరుగు హుస్సేన్ రెడ్డి - దర్గా దగ్గర జన్మించటంతో ఈ పేరు పెట్టడం జరిగినది) . ఆయన 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది 1952లో నేత్రవైద్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు.

ఉద్యోగ జీవితం

ప్రారంభ ఉద్యోగం మద్రాసు మెడికల్ సర్వీసెస్ లో అసిస్టెంట్ సర్జన్ (1949-53) ఆంధ్ర మెడికల్ కాలేజి, కె.జి (కింగ్ జార్జి) హాస్పిటల్, విశాఖ పట్టణంలో ఆఫ్తాల్మోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసిస్టెంట్ సర్జన్ గా (1953-56) పనిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్ (1958 - 61) సరోజినీ ఐ హాస్పటల్ ఆహ్వానం మీద అక్కడ సూపరిండెంట్ గా, అఫ్తాల్మాలజీ ప్రొఫెసర్ గా పదవీ బాధ్యతలు నిర్వహిచ్మారు. 1961-75 తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో చేరారు. అప్తాల్మాలజీ డైరక్టరుగా (1978-81) పోస్టు గ్రాడ్యుయేషన్ స్టడీస్ కు ప్రొఫెసరుగా (1975 - 78) వ్యవహరించారు.

గౌరవ పదవులు

గౌరవ పదవుల విషయంలో ఆయన అత్యున్నత స్థానాలకు ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అఫ్తాల్మాలజీ విభాగానికి ఎమెరిటన్ ప్రొఫెసర్ గా, చైనా లోని సన్-యట్ సెన్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసన్ సంస్థకు విజిటింగ్ ప్రొఫెసర్ గా రాణించారు. గుండెపోటుతో మరణించే వరకు ఆయన హైదరాబాదులోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి కి డైరెక్టరుగా ఉన్నారు.

అనేక దేశాలు పర్యటించారు. అందులో ధనిక దేశలు, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు వున్నాయి. అమెరికా అకాడమీ ఆఫ్ ఆప్తల్మోలజీ వారు కొంతకాలం తమతో ఉండేందుకు ఆహ్వానించి, అపూర్వ గౌరవ మర్యాదలు అందించారు. అనేక దేశాల్లోని సన్నిహిత మిత్రులు తమ దేశాలు వచ్చి, స్థిరపడవలసినదిగా కోరారు. అమెరికాలోని మిత్రులయితే బలవంతం చేశారు కూడా. "ఇండియాలో ఏమి ఉంటావు? అమెరికాలో అయితే బాగా సంపాదించగలవు" అని ఒత్తిడి చేసినా ఈయన యిష్టపడలేదు.

డాక్టర్ శివారెడ్డి భారత దేశంలో కూడా పలు గౌరవాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫ్తాల్మోలాజికల్ అసోషియేషన్ అధ్యక్షులు; ఆల్ ఇండియా అఫ్తాల్మోజాలికల్ సొసైటీ అధ్యక్షులు; ఆసియా ఫసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాలజీ ఉపాధ్యక్షులు; స్థాపక సభ్యులు; అమెరికన్ అకాడమీ ఆఫ్ అఫ్తాల్మొలజీ గౌరవ సభ్యులు; ఇండియన్ నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్సన్ ఆఫ్ బ్లయిండ్‌నెస్ గౌరవ సభ్యులు; ఇంటర్నేషనల్ ఏజన్సీ ఫర్ ఫ్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ మొదలగు గౌరవ పదవులను నిర్వహించారు.

బోధనలో

మద్రాసు యూనివర్శిటీ లో గ్రాడ్యుయేషన్ (1946) , ఆంధ్ర యూనివర్శిటీ లో పోష్ట్ గ్రాడ్యుయేషన్(1952) పూర్తయిన తర్వాత కూడా మూడు దశాబ్దాల పాటు నేత్ర వైద్య చికిత్సను బోధించారు. పరిశోధనలు సల్పారు. 500 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లకు శిక్షన అందించారు. ఈ రోజున దేశ, విదేశాలలో ఈయన శిష్యులు అఫ్తాల్మోజిక్ సర్జన్ లుగా అనేకమంది కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు.

సేవలు

రాష్ట్రంలో అనేక గ్రామాలలో కాటరాక్ట్ సమస్యలతో బాధపడేవారున్నారని గ్రహించారు. ఈ రోజున ఉన్న విధంగా అన్ని ఊళ్లలో కంటి వైద్యులు అందుబాటులో లేరు. కంటివైద్యం చాలా సమస్యాత్మకంగా ఉండేది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కంటి చూపే పోతుందని సమస్యలను అవగాహన చేసుకొని ఊరూరా క్యాంపులు నిర్వహించి ప్రజలను ఎడ్యుకేట్ చేశారు. ఆపరేషన్లు నిర్వహించారు. మన దేశంలో ఈ తరహాగా ఐ క్యాంఫులు, నిర్వహించడం తొలిసారి. దాదాపు 500 క్యాంపులు, మూడు లక్షల కాటరేక్ట్ ఆపరేషన్లు చేశారు. సొంత డబ్బు చాలా ఖర్చు చేశారు. మొబైల్ సర్వీస్ కూడా ఆర్గనైజ్ చెశారు. గవర్నమెంట్ సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా రెండు శతాబ్దాల పాటు క్యాంఫులు నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోకూడా క్యాంపులు పెట్టారు.

క్యాంపులు పెట్టేటప్పుడు చాలామంది పల్లేటూరి వారు డబ్బు తమ వద్ద లేదని మొరపెట్టుకొనేవారు. చికిత్స ఇవ్వడంతో పాటు మెడిసిన్స్ కూడా యిచ్చేవారు. ఫుడ్ కూడా పెట్టేవారు. అద్దాలు కూడా యిచ్చేవారు. కొన్ని సంఘ సేవా సంస్థలు సహకరింపగా, తమ స్వంత డబ్బు కూడా వ్యయపరిచేవారు. రోగులకు ఖర్చుపెట్టే విషయంలో ఏ మాత్రం ఆలోచించే వారు కాదు. దేశంలో అత్యున్నత హోదాలలో ఉన్న చాలామందికి చికిత్స చేసి, "విజన్" కల్పించారు.

ఆయన 1964 లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిదైన టి. ఎల్. కపాడియా ఐ బ్యాంకు ను వ్యాపారవేత్త టి.ఎల్.కపాడియా యొక్క ఆర్ధిక సహాయముతో హైదరాబాదులో నెలకొల్పారు. ఆయన అంతర్జాతీయ సమావేశాలలో రెండొందల పేపర్లకు పైగా సమర్పించారు. పేదవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి తోడ్పడే ఉద్దేశ్యంతో ఆయన ఐదొందలకు పైగా నేత్ర శిబిరాలను నిర్వహించారు. తన నిపుణత వలన కంటి శుక్లాల ఆపరేషనులలో దిట్టగా ఆయన పేరు పొందారు; రెండు లక్షల యాభై వేలకు పైగా కంటి శుక్లాల ఆపరేషనులు చేసి అత్యధిక కంటి శుక్లాల ఆపరేషనులు చేసిన డాక్టరుగా గిన్నీస్ ప్రపంచ రికార్డుల కెక్కారు. భారత ప్రభుత్వం నుండి 1971 లో పద్మశ్రీ, 1977 లో పద్మభూషణ్ పురస్కారాలను పొందారు. ఈయన విశాఖపట్నం, వరంగల్ మరియు కర్నూలులలో ప్రాంతీయ నేత్ర వైద్యశాలల యేర్పాటుకు చాల కృషి చేశారు. 1990లో కర్నూలులో స్థాపించబడిన ప్రభుత్వ నేత్ర వైద్యశాల ఆయన పేరున స్థాపింపబడినది. ప్రఖ్యాత తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి తన పేరున స్థాపించిన చిరంజీవి నేత్ర వైద్యశాల కొరకు శివారెడ్డి గారి సలహాలను కోరి, ఆయన సూచనలను పాటించారు.

సమాజ సేవా కార్యక్రమాలు

కంటి చికిత్సలతో పాటు సోషల్ యాక్టివిటీస్ కూడా అనేకం చేశారు. గ్రంథ రచనలు చేశారు. దేశ, విదేశీ ప్రత్రికల్లో సైంటిఫిక్ ఆర్టికల్స్ అనేకం రాసారు. 1985 నుంచి భారతీయ విద్యాభవన్ కు ఛైర్మన్ గా యున్నారు. సిబిఐటి బోర్డులో ఉన్నత పదవులను అలంకరించారు. అళాసాగర్ సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా కొంతకాలం ఉన్నారు. ఈ విధంగా పలు సోషల్ ఏక్టివిటీస్ లో ఉండేవారు.

దేశంలోనే కంటి ఆసుపత్రులలో చిరకాలం మంచి ప్రఖ్యాతమైనదిగా ఉన్న సరోజినీదేవి ఐ హాస్పటల్ కీర్తి ప్రతిష్టలను ఈయన సారధ్య నైపుణ్యం,మార్గదర్శకత్వాలే ప్రధాన కారనాలు. కార్నియల్ గ్రాప్టింగ్ రంగంలో ప్రత్యేకంగా ఘనకీర్తి నార్జించటనికి గల కారణం కూడా ఈయన ప్రతిభే. అంతర్జాతీయ మెడిసన్ జర్నల్స్ లో దాదాపు 30 పరిశోధనా పత్రాలను వెలువరించారు. "Text book of Ophthalmology for Under graduates" గ్రంథ రచనకు ఈయన సహ రచయిత. 1973 లో జర్మనీ దేశంలోని మ్యూనిచ్ నగరంలో జరిగిన ఇంటర్నేసహ్నల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆఫ్తాల్మోలజీలో ఈయన కనుగొన్న చాలా అరుదైన చాలా అరుదైన క్రిమికి (అకసేరుక జీవి) సంబంధించిన సమాచారం అందించారు. తర్వాతి కాలంలో దానికి ఈయన పేరు మీదనే Gordia Reddy అని నామకరణం చేశారు.

గౌరవాలు, సత్కారాలు

జాతీయ స్థాయిలో కంటి చికిత్స రంగంలో అత్యున్నత స్థాయి కీర్తి ప్రతిష్టలు పొందిన డాక్టర్ శివారెడ్డికి అనేక ప్రతిష్టాత్మక గౌరవాలు , అవార్డులు అందాయి. 1970 లో పద్మశ్రీ; 1977 లో పద్మభూషణ్; వెంకటేశ్వర యూనివర్శిటీ వారిచే డి.ఎస్.సి.(Hon.Cau)(1980); 1981 లో అమెరికన్ అకాడమీ ఆఫ్ అఫ్తాల్మోలజీ వారి గెస్ట్ ఆఫ్ హానర్; 1981 లో డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డు; లక్ష కాటరేక్ట్ ఆపరేషన్లు పూర్తిచేసిన సందర్భంగా దేశ ప్రధానిచే మెమెంటో బహూకరణ; 1985 లో ఆసియా-పసిఫిక్ అకాడమీ ఆఫ్ అఫ్తాల్మోలజీ వారి జీన్ రిజాల్ మెడల్ (ఆసియా - పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాల్ మొకజీ వారిచే) ఆడెన్ వాలా ఓరేషన్ గోల్డ్ మెడల్ మొదలగునవి.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ భారత ప్రభుత్వం 1971
పద్మ భూషణ్ భారత ప్రభుత్వం 1977