సింగీతం శ్రీనివాసరావు
స్వస్థలం: నెల్లూరు జిల్లా ఉదయగిరి
జననం: 21 వ తేది సోమవారం, సెప్టెంబర్ 1931

సింగీతం శ్రీనివాసరావు  ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ - ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమానం,ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు,కథకుడు కూడా.

జీవిత విశేషాలు

సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాధ టాగూరు నాటకం "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ చూశాడు. 'టామ్ బుచాన్' అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "తెలుగు స్వతంత్ర" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు.

సినిమాల జాబితా

ముంబై ఎక్స్‌ప్రెస్ (2005), Son of Alladin (2003)- 3D యానిమేషన్ చిత్రం., Little John (2002), ఆకాశ వీధిలో (2001), శ్రీకృష్ణార్జున విజయ౦ (1996), చిన్న వతియార్ (1995), భైరవద్వీపం(1994), ఆడవాళ్ళకు మాత్రమే (1994), మేడమ్(1993), ఫూల్ (1993), బృందావనం(1992), క్షీరసాగర (1992), ఆదిత్య 369 (1991), మైకేల్ మదన కామరాజు కథ(1991), అపూర్వ సహోదరులు (1989) ( తమిళం: అపూర్వ సహోదరగళ్, హిందీ: అప్పూరాజా), చిరంజీవి సుధాకర (1988), దేవతా మనుష్య (1988), పుష్పక విమానం (1988) - డైలాగులు లేని సినిమా, కనుక అన్ని భాషలలోనూ విడుదలయ్యింది, అమెరికా అబ్బాయి (1987), ఆనంద(1986), మయూరి (1984), శ్రావణ బంతు(1984), చెలిసువ మొదగళు(1982), Nancy (1981), అమావాస్య చంద్రుడు (తమిళం: రాజా పారవై) (1981), త్రిలోక సుందరి, మంగళ తోరణాలు(1979), గమ్మత్తు గూఢచారులు (1978), రామచిలుక (1978), సొమ్మొకడిది సోకొకడిది (1978), అందమె ఆనందం (1977), నిరపరయుమ్ నిలవిక్కుమ్ (1977), పంతులమ్మ (1977), తరం మారింది (1977), అమెరికా అమ్మాయి (1976), ఒక దీపం వెలిగింది(1976), జమీందారు గారి అమ్మాయి (1975), దిక్కట్ర పార్వతి (1973), నీతి నిజాయితి (1972)