టంగుటూరు ప్రకాశం పంతులు
తల్లిదండ్రులు:  సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య
స్వస్థలం: ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామం
జననం: 23 వ తేది శుక్రవారం, ఆగస్ట్ 1872
మరణం: 20 వ తేది సోమవారం, మే 1957

టంగుటూరి ప్రకాశం పంతులు (జ.ఆగష్టు 23, 1872 – మ.మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

బాల్యం

టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.  ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరి లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తి లో ఉండేది. ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే ఇద్దరు కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసేవిధంగా, ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గర్లో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం తాతగారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కమార్తెలు. వారిలో ఆఖరి వాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజం లో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.

ప్రజాసేవలో

లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు. 1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వఛ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా మరియు జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.

రాజకీయ జీవితం

1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. 1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు.  

వీడియోలు...

పంతులు గారి జీవిత విశేషాలు

ప్రకాశం పంతులు గురించి