ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూత
16 వ తేది గురువారం, జులై 2015

 ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు విస్సంరాజు రామకృష్ణ(68) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రామకృష్ణ జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విస్సంరాజు రంగశాయి-రత్నం దంపతులకు 1947 ఆగస్టు 20న విజయనగరంలో రామకృష్ణ జన్మించారు.
    
    ప్రఖ్యాత సినీ నేపథ్యగాయని సుశీల.. రామకృష్ణకు పినతల్లి. ఆయన నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. అలనాటి అగ్రహీరోలందరికీ గాత్రం అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భక్తి గీతాల ఆలాపనలో తనదైన ముద్రవేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన విశిష్ట గాయకుడు ఆయన. సుమారు 200 చిత్రాల్లో అయిదువేలకు పైగా పాటలను పాడారు.
    
    రామకృష్ణ మృతితో సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, నటుడు తనికెళ్ల భరణి, ఎస్పీ.శైలజ, సునీత తదితర గాయకులు, దర్శకులు విచ్చేసి రామకృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన అంత్యక్రియలు పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో జరిగాయి. రామకృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు.
    
    పార్క్ హయత్ హోటల్లో జరిగిన సంతాప సభకు రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి, నటీమణులు జమున, జయసుధ, జయప్రద, జీవిత రాజశేఖర్, నటుడు సుమన్, దర్శకుడు కోదండరామిరెడ్డి,సురేష్బాబు తదితరులు హాజరై సంతాపం వ్యక్తంచేశారు. కొద్దిసేపు పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.