విస్సంరాజు రామకృష్ణ
తల్లిదండ్రులు:  రంగసాయి, రత్నం
స్వస్థలం: విజయనగరంలో
జననం: 20 వ తేది బుధవారం, ఆగస్ట్ 1947
మరణం: 16 వ తేది గురువారం, జులై 2015

వి.రామకృష్ణ(విస్సంరాజు రామకృష్ణ) (ఆగష్టు 20, 1947 - జూలై 16, 2015) 1970 వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని ప్రముఖ చిత్రాలు తాతామనవడు, భక్తతుకారాం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, దానవీరశూర కర్ణ, మహాకవి క్షేత్రయ్య, అమరదీపం, శ్రీమద్‌విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, కరుణామయుడు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు. అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ మద్రాసులో నివసిస్తున్నారు. రామకృష్ణ దాదాపు 5000లకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాల అల్బంలు విశేష ఆదరణ పొందాయి.

తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ 200 చిత్రాల్లో దాదాపు 5వేలకు పైగా గీతాలను ఆలపించారు.

జననం

రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు 1947, ఆగష్టు 20 న విజయనగరం లో జన్మించాడు. ప్రముఖ గాయని పి.సుశీల ఈయనకు మేనత్త. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆకాశవాణి లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించాడు.

1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలిచ్చి దూరదర్శన్ లో పాటలు పాడి, పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె. 2001లో నువ్వే కావాలి చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు సాయి కిరణ్ వీరి అబ్బాయే. కూతురు లేఖకు కూడా సినీరంగలో అవకాశాలు వస్తున్నాయి.

మరణం

కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన 2015, జూలై 16 న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

సినిమాలు

విచిత్రబంధం (1972) : వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట
అందాల రాముడు (1973)
తాత మనవడు (1973) : అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
పల్లెటూరి బావ (1973)
శారద (1973) : శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ
అల్లూరి సీతారామరాజు (1974) : తెలుగువీర లేవరా (ఘంటసాలతో)
గుణవంతుడు (1975)
ముత్యాల ముగ్గు (1975) : ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు
భక్త కన్నప్ప (1976)
మహాకవి క్షేత్రయ్య (1976)
సీతా కళ్యాణం (1976)
చక్రధారి (1977)
అమరదీపం (1977) : నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది
దాన వీర శూర కర్ణ (1977)
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)
శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
బావా మరదళ్ల సవాల్ (1988)

సంభంధిత వార్తలు
ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూత

16 వ తేది గురువారం, జులై 2015