వై.వి. రావు - యెర్రగుడిపాటి వరదరావు
స్వస్థలం: నెల్లూరు
జననం: 30 వ తేది శనివారం, మే 1903
మరణం: 14 వ తేది బుధవారం, ఫిబ్రవరి 1973

యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (జ: మే 30, 1903 - మ: ఫిబ్రవరి 14, 1973) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. వై.వి.రావు 1903 మే 30న నెల్లూరులో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో బొంబాయి వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు అర్దేషిర్ ఇరానీ యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన ఆర్.ఎస్.ప్రకాష్ యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు 1939 లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చింతామణి పిక్చర్స్ ను స్థాపించాడు. 1950లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, కొల్హాపూర్, మద్రాసు మరియు మైసూరులలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన సతీ సులోచన ఈయనే నిర్మించాడు.

1946లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు తమిళ సినిమా నటీమణి అయిన కుమారి రుక్మిణిని వివాహమాడినాడు. తెలుగు సినీనటి లక్ష్మి (జీన్స్ చిత్రములో బామ్మ) ఈయన కూతురే.

చిత్ర సమాహారం

హెన్నిన బాలు కన్నెరు (1963), నాగార్జున (1961/I), శ్రీకృష్ణ గారడి (1958/I మరియు II), మంజరి (1953), మానవతి (1952), లవంగి (1946) (1950), రామదాస్(1948), తాసీల్దార్ (1944) (నటుడు, కథా రచయిత, నిర్మాత మరియు దర్శకుడు), సత్యభామ (1942) (నటుడు, నిర్మాత మరియు దర్శకుడు), సావిత్రి (1941), విశ్వమోహిని (1940) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు), మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు), భక్త మీరా (1938), స్వర్ణలత (1938), నాగానంద్ (1935/I మరియు II), సతీ సులోచన (1934/II) (నటుడు మరియు దర్శకుడు), హరి మాయ (1932), పాండవ అజ్ఞాతవాసం (1930), సారంగధర (1930), శ్రీ సుబ్రహ్మణ్యం (1930)