ఎఱ్రాప్రగడ - ఎర్రన
స్వస్థలం: పాకనాడు సీమ (ప్రకాశం జిల్లా కందుకూరు లోని గుడ్లూరు)

ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసినాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.

సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎర్రయ్యను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడ వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు కలదు.

బిరుదులు

ఎర్రనకు రెండు బిరుదులున్నాయి (1) శంభుదాసుడు (2) ప్రబంధ పరమేశ్వరుడు. మొదటి బిరుదు అతని ఆధ్యాత్మిక ప్రవృత్తినీ, రెండవ బిరుదు అతని సాహిత్య విశిష్టతనూ తెలుపుతాయి.
'శంభుదాసుడు'గా తాను ప్రశస్తుడవుతాడని తన తాతగారు కలలో కనిపించి ఆశీర్వదించారని నృసింహపురాణం పీఠికలో ఎర్రన వ్రాసుకొన్నాడు. అతని బిరుదు శంభుదాసుడు అయినప్పటికీ అతడు గ్రహించినవన్నీ విష్ణుకథలే. ఈ విధంగా ఎర్రన హరిహరాద్వైతమును జీవితంలోనూ, రచనలలోనూ కూడా పాటించాడని తెలుస్తుంది.
'ప్రబంధ పరమేశ్వరుడు' అనే ప్రశస్తి అరణ్య పర్వశేష రచన వలన కలిగి, తరువాత అది బిరుదంగా కొనసాగిందని నృసింహపురాణంలోని ఒక పద్యం ద్వారా తెలుస్తున్నది. ఎర్రన పురాణకవుల కోవకు చెందినవాడయనా గాని, అద్భుతమైన తన వర్ణనాత్మకత ద్వారా తరువాతి ప్రబంధ కవులకు మార్గదర్శకమైనాడు. అతని ప్రబంధశైలి నృసింహపురాణంలో ఉన్నత స్థాయిని చేరుకుంది.

రచనలు

రామాయణము
హరివంశము
మహాభారతము అరణ్యపర్వశేషము
నృసింహపురాణము